News

జగన్ పిటిషన్ పై విచారణ నేడే:పిల్ తో కలపడంపై ధర్మాసనం ఆశ్చర్యం...విచారణకు సహకరించడం లేదన్న ఏజీ

తనపై జరిగిన హత్యాయత్నం మీద దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించాలంటూ ప్రతిపక్షనేత జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ నేడు హై కోర్టులో విచారణకు రానుంది. జగన్ దాఖలు చేసిన పిటిషన్ విషయమై ఇంతకుముందు సింగిల్‌ జడ్జి విచారణ చేయకుండా తమ ముందున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో జత చేయడంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు తనపై దాడికి సంబంధించి దర్యాప్తుకు జగన్ సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో నేటి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశాఖ ఎయిర్ పోర్టులో తనపై జరిగిన హత్యాయత్నంపై దర్యాప్తును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థచే జరిపించాలని ఆదేశించాలని కోరుతూ ఏపీ ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హై కోర్టులో నేడు విచారించనున్నారు. అయితే జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సింగిల్‌ జడ్జి విచారించకుండా తమ ముందున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో జత చేయడంపై ఛీప్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసిందని సమాచారం. ఒక బాధితుడిగా జగన్మోహన్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేస్తే, దానిని పిల్‌తో జత చేయడం కాకుండా సింగిల్‌ జడ్జి విచారించి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడిందని తెలిసింది. గురువారం వాదనల సందర్భంగా జగన్‌పై దాడిని చిన్నదని, వైసీపీ కార్యకర్తే సానుభూతి కోసం దాడి చేశారని డిజిపి, సీఎం మీడియాతో చెప్పారని, ఎటువంటి విచారణ జరగక ముందే ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల తమకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై నమ్మకం పోయిందని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి ధర్మాసనంకు తెలిపారు. అయితే బాధితుడే కోర్టును ఆశ్రయించాక ఇక పిల్ దాఖలు చేయడం దేనికని సీజే వారిని ప్రశ్నించారని తెలిసింది. దాడిపై స్వతంత్ర సంస్థతో విచారణ కోరుతూ ఇటు జగన్‌, అటు వైవీ సుబ్బారెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో సిజే ప్రశ్నించారు. అలాగే ఎయిర్ పోర్టుల్లో సెక్యూరిటీపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అనిల్‌కుమార్‌ అనే మరో వ్యక్తి మరో పిల్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్ తో సహా మూడు వ్యాజ్యాలు గురువారం చీఫ్‌ జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తన వాదన వినిపిస్తూ దర్యాప్తునకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సహకరించడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తులో భాగంగా రక్తం మరకలున్న చొక్కాను కోరినా ఆయన ఇంత వరకూ సంబంధిత అధికారులకు అందజేయలేదని, అలాగే సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద వాంగ్మూలం ఇవ్వడానికీ జగన్ నిరాకరించారని ఏజీ హై కోర్టుకు నివేదించారు. విచారణ సందర్భంగా సిజే నేతృత్వంలోని ధర్మాసనం జగన్ పై దాడి గురించి దర్యాప్తు తీరుపై శుక్రవారం హై కోర్టుకు నివేదిక అందజేయాలని ఏజీని ఆదేశించగా... దర్యాప్తు నివేదికను విశాఖ నుంచి తెప్పించాల్సి ఉందని...సోమవారం లేదా మంగళవారం నాటికి కోర్టుకు అందజేయగలమని ఏజీ బదులిచ్చారని తెలిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతిపక్షనేత భద్రత తదిదర కీలక అంశాలు ముడిపడివున్న ఈ కేసు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది.