News

మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామితో భేటీ కోసం...సీఎం చంద్రబాబు నేడు బెంగుళూరు పయనం

ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బిజెపి కూటమిని అధికారంలోకి రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నల్లో భాగంగా నేడు బెంగుళూరుకు వెళ్లనున్నారు. తాజాగా కర్ణాటక ఉప ఎన్నికల్లో జెడిఎస్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం నేపథ్యంలో కర్ణాటక సీఎం కుమారస్వామి...ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడతో సిఎం చంద్రబాబు భేటీ కానున్నారు. బిజెపి వ్యతిరేక పార్టీలను ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఇదే వారంలో డీఎంకే అధినేత స్టాలిన్‌, బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని కూడా కలవనున్నట్లు తెలిసింది. మాజీ ప్రధాని దేవగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సమావేశం కానున్నారు. వీరి సమావేశం బెంగళూరులోని పద్మనాభనగర్‌ ఉన్న దేవెగౌడ నివాసంలో జరగనున్నట్లు తెలిసింది. కేంద్రంలోని ఎన్డీఏతో ఢీ కొడుతున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీని అధికారంలోకి రానిచ్చేది లేదని సవాలు విసురుతున్న సంగతి ఆ క్రమంలో ఇటీవలే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై సంచలనం సృష్టించిన చంద్రబాబు అదే క్రమంలో దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకతాటి మీదకు తెచ్చేందుకు తానే నడుం బిగించారు. అందులో భాగంగా బిజెపి ప్రత్యర్థులైన జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గురువారం జేడీఎస్‌ ముఖ్య నేతలతో చర్చించనుండగా ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారని తెలిసింది. తాజాగా కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలు,రెండు శాసన సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఒక్కచోట మాత్రమే బీజేపీ గెలిచింది. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప విజయం సాధించగా...మాండ్య లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్‌ అభ్యర్థి శివరామ‌ గౌడ...శివమొగ్గ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర విజయం సాధించారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జామ్‌ఖండి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్‌సిద్దు న్యామగౌడ, రామనగర అసెంబ్లీ స్థానం నుంచి జేడీఎస్‌ అభ్యర్థి అనితా కుమారస్వామి ఘన విజయం సాధించారు.