News

అసలైన దీపావళి అప్పుడే: కేసీఆర్‌పై స్మృతి ఇరానీ నిప్పులు, తెలుగులో మాట్లాడటంతో..

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అసలైన దీపావళి అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆదివారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఆదరణ పెరుగుతుండటంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ఆదివారం రాత్రి బీజేపీ కిషన్ రెడ్డికి మద్దతుగా అంబర్‌పేటలో చేపట్టిన ఎన్నికల ప్రచార సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్రం దేశవ్యాప్తంగా పేదల కోసం ఆయుష్మాన్‌ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనిని రాష్ట్రంలో అమలు చేయకుండా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారన్నారు. అనేక పథకాల అమలు తీరులోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకుండా అమరవీరులను టీఆర్ఎస్ అవమానించిందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ విమోచన దినంగా భావించి కేసీఆర్‌ను ఓడించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంతలా మారారన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం అంటే కుటుంబ పాలన అని టీఆర్ఎస్ భావిస్తోందని స్మృతి ఇరానీ అన్నారు. రాష్ట్రం మొత్తం ఒక కుటుంబ పాలన కింద ఉందన్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మోడీకి దేశవ్యాప్తంగా ఆదరణ ఉందన్నారు. బీజేపీ, కిషన్ రెడ్డి విజయాన్ని నిజమైన దీపావళి వేడుకగా భావించాలని చెప్పారు. పేదల ప్రజల కోసం మోడీ ఎన్నో పథకాలు ప్రారంభించారన్నారు. కాగా, స్మృతి ఇరానీ దాదాపు పది నిమిషాలు మాట్లాడారు. ఆమె మొదట కాసేపు తెలుగులో మాట్లాడి అందరినీ అలరించారు. ఆమె తెలుగులో మాట్లాడినప్పుడు కార్యకర్తలు కేరింతలు కొట్టారు.అంబర్ పేట బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు బీజేపీతోనే ఉన్నారని చెప్పారు. తమ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి బీజేపీ గెలుపునకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... సంక్షేమ పథకాల అమలులో కేంద్రం ముందంజలో ఉందన్నారు.